అనుకున్నది సాధించడానికి, డబ్బు సంపాదించడానికి వయసు అడ్డుకాదన్న విషయాన్ని లోకానికి చాటింది 50 ఏండ్ల కమల్ జిత్ కౌర్. ఇంతకీ ఈ మహిళ ఏం వ్యాపారం చేస్తోందో తెలుసా?
ప్రస్తుత కాలంలో ఆడవారు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఐటీ సంస్థల నుంచి ఎడ్టెక్ వరకు వ్యాపార రంగానికి మహిళలు చేసిన కృషి ఎనలేనిది. ఎక్కడో చిన్న చిన్న గ్రామాలకు చెందిన వారైనా మంచి మంచి పొజీషన్ లో స్థిరపడ్డారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ప్రతిభ కలిగిన మహిళలు ఎన్నటికైనా విజయం సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని నిరూపిస్తూ వస్తున్నారు. ఇలాంటి గొప్ప మహిళల్లో కమల్ జిత్ కౌర్ కూడా ఒకరు. మరి ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కమల్ జిత్ కౌర్ కోవిడ్ కాలంలో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. అదెక్కడో కాదు తన వంటగదిలోనే. ఇప్పుడు ఈమె లక్షాధికారి అయ్యి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వెన్న లేదా క్రీమ్ కాకుండా పెరుగు నుంచి తాజా నెయ్యిని తయారు చేసే కమల్ జిత్ కౌర్ 50 సంవత్సరాల వయస్సులో కిమ్స్ కిచెన్ ను స్థాపించారు. తన వినూత్న వ్యూహంతో ప్రతి నెలా వేల డాలర్లు సంపాదిస్తోంది.
2020లో కమల్జిత్ ముంబైలో కిమ్స్ కిచెన్ ను స్థాపించారు. తాజా, స్వచ్ఛమైన నెయ్యిని అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈమె పంజాబ్ లూధియానా గ్రామంలో నివసిస్తున్నప్పుడు స్వచ్ఛమైన పాలను, పెరుగు, నెయ్యిని తినేదట. అయితే ఆమె పెళ్లి తర్వాత స్వచ్ఛమైన పాల ఉత్పత్తులే దొరికేవి కాదట. అందుకే కమల్ జిత్ తాజా నెయ్యిని ప్రజలకు అందించడానికి సొంతంగా దీన్ని తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈమె నెయ్యిని తయారుచేయడానికి సంప్రదాయ బిలోనా పద్ధతిని ఎంచుకుంది. ఇక ఈ నెయ్యిని తయారు చేయడానికి ఆమె పంజాబీ నగరమైన లుధియానాకు చెందిన పాలను మాత్రమే ఉపయోగిస్తుంది. ఏదేమైనా లుధియానా నుంచి పాలు పొందడం అంత సులువైన పనేం కాదు. ఎంత కష్టమైనా తన నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు. అంతేకాదు కమల్ జిత్ తాను పొందే పాల రుచి, నాణ్యతలో ఎలాంటి మార్పు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
నెయ్యిని వివిద పద్దతుల్లో తయారుచేయొచ్చు. ఇది అందరికీ తెలిసిందే. కానీ కమల్ జిత్ మాత్రం నెయ్యిని తయారుచేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు. ఆమె బిలోనా అని పిలువబడే పద్ధతిని ఉపయోగించి నెయ్యిని తయారుచేస్తోంది. దీనిలో వెన్న, క్రీమ్ లేదా పాలకు బదులుగా పెరుగును నెయ్యి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో మొదట ఆవు పాలను మరిగించి చల్లబరుస్తారు. వీటిని పెరుగు వేస్తారు. రాత్రంతా ఉంచిన తర్వాత మరుసటి రోజు పెరుగు నుంచి నెయ్యిని తీయడం మొదలుపెడతారు.
నెల సంపాదన
ఈ మధ్యకాలంలో కమల్ జిత్ కౌర్ నెయ్యికి బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కూడా ఈ స్వచ్ఛమైన నెయ్యిని ఆర్డర్ చేస్తున్నారు. రిటైల్ నెయ్యి బాటిల్స్ మూడు విభిన్న పరిమాణాలలో వస్తాయి. 220 మి.లీ, 500 మి.లీ, 1 లీటర్. అయితే ఆర్డర్ చేసిన సంఖ్యను బట్టి 220 మిల్లీలీటర్ల ధర పెరుగుతుంది.
ఈ కంపెనీకి సీటీవోగా కమల్ జిత్ కుమారుడు పనిచేస్తున్నారు. అయితే 2021లో వీరు ప్రతి నెలా రూ. 20 లక్షలకు పైగా ఆధాయాన్ని సంపాదించేవారు. అలాగే 4500 కంటే ఎక్కువ నెయ్యి బాటిళ్లను విక్రయించారు. ఈ మహిళా మేము ఏం చేయలేము అనుకునేవారికి ఆదర్శం.
