Yati Narsinghanand hate speech: విద్వేష ప్రసంగాల నేపథ్యంలో జైలుకెళ్లి బెయిల్‌పై బయటకొచ్చిన యతి నర్సింహానంద్.. మరోమారు వార్తల్లో నిలిచారు. ఢిల్లీలో జరిగిన హిందు మహాపంచాయత్ సభలో మరోమారు విద్వేష ప్రసంగం చేశారు. భారత దేశంలో ముస్లీం ప్రధాని అయితే.. 50 శాతం హిందువులు ముస్లీంలుగా మారుతారని, దీంతో . ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఆయుధాలు పట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Yati Narsinghanand hate speech: తన విద్వేష ప్రసంగాలతో వార్తల్లో నిలుస్తారు యతి నర్సింహానంద్. ఇప్పటికే విద్వేష ప్రసంగాలు చేసి.. ఆయన జైలుకు కూడా వెళ్లారు. ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా.. బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన హిందూ ముస్లీంల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా.. విద్వేష ప్రసంగం చేశారు. ఈశాన్య ఢిల్లీలో ఆదివారం జరిగిన 'హిందు మహాపంచాయత్' కార్యక్రమంలో నర్సింహానంద్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. "2029లోనో, 2034లోనో లేక 2039లో ముస్లిం అభ్యర్థి ప్రధాని అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే.. 50శాతం హిందువులు.. ముస్లింలుగా మతాన్ని మార్చుకుంటారు. మిగిలిన 40శాతం మందిని ముస్లింలు చంపేస్తారు. మిగిలిన మరో 10శాతం మంది శరణార్థులుగా జీవిస్తారు. ఇదే హిందువుల భవిష్యత్తు. నేను చెప్పిందే జరుగుతుంది. అందువల్ల ఈ భవిష్యత్తును మార్చుకోవాలంటే.. మీరు మనిషిలా మారి.. ఆయుధాలను చేపట్టండి," అని నర్సింహానంద్ పేర్కొన్నారు. నర్సింహానంద్ విద్వేష ప్రసంగానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆదివారం జరిగిన హిందు మహాపంచాయత్‌లో వందలాది మంది పాల్గొన్నట్టు సమాచారం.
“తమ డిమాండ్లను నెరవేర్చమని హిందువులు వేడుకోవడం నేను చాలా కాలంగా చూశాను. కానీ ఏ ఒక్క హిందువు డిమాండ్ కూడా నెరవేరడం నేను చూడలేదు. భిక్షాటన చేయడం ద్వారా కాదు, కోర్టు జోక్యంతో మాకు రామజన్మభూమి వచ్చింది, కాబట్టి బిచ్చగాడిగా ఉండటం మానేయండి” అని నర్సింహానంద్ పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను కవర్ చేయడానికి వెళ్లిన ఢిల్లీకి చెందిన కొంతమంది జర్నలిస్టులపై అక్కడ అసభ్యంగా ప్రవర్తించారు. అయితే వారిని అదుపులోకి తీసుకున్నారనే వాదనను పోలీసులు తోసిపుచ్చారు.
హరిద్వార్‌లో విద్వేష ప్రసంగాలు.. నర్సింహానంద్ గతంలో ఇలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసి..కేసుల్లో చిక్కుకున్నారు. గత ఏడాది హరిద్వార్‌లో డిసెంబర్ 17 నుంచి 19 మధ్య జరిగిన "ధర్మ సన్సద్"లో ముస్లింలకు వ్యతిరేకంగా అత్యంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముస్లింలు మారణహోమాన్ని సృష్టిస్తారని, వారి నుంచి హిందువులు బయటపడాలని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. విషయం పెద్దదిగా మారింది. అయినా నర్సింహానంద్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. చివరికి జనవరిలో నర్సింహానంద్ అరెస్ట్ అయ్యారు. కాగా ఫిబ్రవరి 7న ఆయనకు బెయిల్ లభించింది. అదే నెల 18న జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత.. ఆయన మళ్లీ విద్వేష ప్రసంగాలు చేయడం గమనార్హం.
