తప్పుడు ప్రచారం.. ఐదేండ్ల క్రితం వీడియో.. తాజాగా నెట్టింట్లో వైరల్..
మైనర్ బాలుడిని కొందరు రైల్వే ట్రాక్‌మెన్స్ తిడుతూ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అయితే.. ఈ వీడియో ఇటీవల కర్ణాటకలో చిత్రీకరించబడిందని, ముస్లిం సమాజం రైలు పట్టాలు ధ్వంసం చేయడానికి పిల్లలను ఉపయోగించుకుంటున్నరనే వాదన వచ్చింది. కానీ ఆరోపణలు అవాస్తమని తేలిపోయింది. అది అసత్యం ప్రచారమని వెల్లడైంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి..
తాజాగా కొందరు రైల్వే సిబ్బంది మైనర్ బాలుడిని తిట్టిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో కర్ణాటకకు చెందినదని, ఇది ఇటీవల జరిగిన ఘటన అని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు రైలు పట్టాలు తప్పేందుకు పిల్లలను ఉపయోగించుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
ఈ వీడియోను అరుణ్ పుదూర్ (@arunpudur)జూన్ 5న షేర్ చేశారు. ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేస్తూ.. "షాకింగ్: మరో రైలు ప్రమాదం తప్పింది. కర్ణాటకలో రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేస్తూ ఓ యువకుడు పట్టుబడ్డాడు. మనకు వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. కొందరూ విధ్వంసం చేయడానికి పిల్లలను ఉపయోగిస్తున్నారు. ఇది తీవ్రమైన సమస్య."అని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ 6 లక్షలకు పైగా వీక్షించగా.. 4 వేలకు పైగా రీట్వీట్ చేయబడింది.
ఇదిలాఉంటే.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొన్ని వార్తా సంస్థలు కూడా ఎటువంటి ధ్రువీకరణ లేకుండా ఈ విషయాన్ని నివేదించాయి. పలు కథనాలకు ప్రచురించాయి. enbee007, @maheshyagyasain, @Lawyer_Kalpana, @ZenralBazwa, @ByRakeshSimha మరియు @Goan_Senorita వంటి అనేక ఇతర వినియోగదారులు కూడా ఈ వీడియోను షేర్ చేసారు. మరోవైపు.. @SubbaRaoTN అనే వినియోగదారు ట్విట్టర్ థ్రెడ్‌లో వీడియోను షేర్ చేస్తూ.. “ఈ వీడియో కర్ణాటకకు చెందినది… అలాంటి పిల్లలను జిహాదీలు పట్టాలు తొలగించడానికి ఉపయోగిస్తున్నారు అని ఆరోపించారు. ఆయన చేసిన ట్వీట్ 300 సార్లు రీట్వీట్ చేయబడింది.
చెక్ ఫ్యాక్ట్
altnews అనే వార్త సంస్థ InVid సాఫ్ట్‌వేర్ సహాయంతో ఈ వీడియోను పరిశీలించింది. అయితే.. ఈ వీడియో మే 12, 2018న ఫేస్‌బుక్ పోస్ట్ చేయబడినట్టు కనుగొన్నారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోందనీ, ఈ వీడియో ఇటీవలిది కాదని, దాదాపు ఐదేళ్ల నాటిదని తెలిపింది. అలాగే, వైరల్ అయిన పోస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని.. వీడియోలోని వ్యక్తులు కన్నడలో మాట్లాడటం చూసి.. ఈ విషయంపై మరింత సమాచారం కోసం రాయచూరు రైల్వే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్‌ను సంప్రదించారు.
altnewsతో ఆయన మాట్లాడుతూ.. “ఈ వీడియో 2018 నాటిది. సమీపంలోని మురికివాడల పిల్లలు ట్రాక్ దగ్గర రాళ్లు వేసి ఆడుకుంటున్నారు. మతపరమైన వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారని, అయితే రైలును పాడు చేయాలనే ఉద్దేశ్యం పిల్లలకు లేదని ఆయన అన్నారు. అక్కడ ఉన్న ట్రాక్‌మ్యాన్ అబ్బాయిలను మందలించాడని, కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టాడని రవికుమార్ ఆల్ట్ న్యూస్‌కు తెలిపారు.
ఈ సంఘటన కలబురగి మెయిన్ స్టేషన్ నుండి 2 కి.మీ దూరంలో ఉన్న హిరేనందూరులో చోటు చేసుకున్నట్టు రవి కుమార్ వెల్లడించారు. అలాగే.. ఆడుకుంటున్న పిల్లలను పట్టుకున్న ట్రాక్‌మెన్‌లు గోపాల్, రాజ్‌కుమార్, రాజు అని తెలిపారు. మొత్తంమీద.. ఈ ఘటనలో మతపరమైన కోణం లేదనీ, పిల్లవాడికి రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేయడానికి ఉద్దేశం లేదని తేలిపోయింది.