Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో 5 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం.. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు..

ఢిల్లీలో ఓ ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్ అయ్యింది. ఆ తరువాత చిన్నారి మీద అత్యాచారం చేసి.. పార్క్ సమీపంలో వదిలేసి వెళ్లారు. ప్రస్తుతం చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. 

5-Year-Old Girl Kidnapped and Raped In Delhi
Author
First Published Dec 23, 2022, 12:18 PM IST

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆ తరువాత ఔటర్-నార్త్ ఢిల్లీ ప్రాంతంలో అత్యాచారం చేసిన ఘటన బుధవారం ఢిల్లీలో చోటు చేసుకుంది. బుధవారం భాల్స్వా డెయిరీ ప్రాంతంలోని తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి కిడ్నాప్‌కు గురైన ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన దాని ప్రకారం కిడ్నాపర్ బాలికను తన చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. 

మరుసటి రోజు గురువారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలోని పార్కు సమీపంలో ఐదేళ్ల చిన్నారి అపస్మారక స్థితిలో కనిపించిదని స్థానికులు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో నిందితుడు పరారయ్యాడని, అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

బాలిక తల్లిదండ్రులు దినసరి కూలీలు. బుధవారం రాత్రి వారు పనుల నుంచి ఇంటికి చేరుకునేసరికి కూతురు కనిపించలేదు. ఎక్కడ వెతికినా దొరకలేదు. దీంతో చిన్నారి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. ఆమె ఫోటోను ఇతర పోలీసు స్టేషన్లకు కూడా పంపించారు. 

దేశంలో 3వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు.. వైరస్ వ్యాప్తిపై కేంద్రం వరుస సమావేశాలు

చిన్నారి గురించి ఆ ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రకటనలు కూడా చేశామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బుధవారం రాత్రంతా అన్వేషణ కొనసాగిందని, గురువారం ఉదయం 7 గంటలకు పార్క్ సమీపంలో చిన్నారి కనిపించిందని ఔటర్-నార్త్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం, అపహరణకు పాల్పడిన నిందితులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) పోలీసుల నుంచి నివేదిక కోరింది. "ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆమెను భల్స్వా డెయిరీలోని ఆమె ఇంటి ముందు నుండే ఎత్తుకెళ్లారు. ఆ చిన్నారి తరువాత దగ్గర్లోని నది దగ్గర దొరికింది. ఆమెకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. మా బృందం ఆమెతో ఉంది. నిందితులను త్వరగా అరెస్టు చేసేలా ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసాం' అని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios