మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న ఐదుగురు కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించారు.  మొరెనా జిల్లాలో ఫుడ్ ఫ్యాక్టరీలో ఈ దారుణం జరిగింది. 

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న ఐదుగురు కార్మికులు ప్రమాదవశాత్తూ మరణించారు. బుధవారం మొరెనా జిల్లాలో ఫుడ్ ఫ్యాక్టరీలో ట్యాంక్ నుంచి వెలువడిన విషవాయువును పీల్చడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక సాక్షి ఫుడ్ ప్రొడక్ట్స్‌ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు కర్మాగారంలోని ట్యాంక్ నుంచి గ్యాస్ వెలువడటం ప్రారంభమైందని.. దానిని తనిఖీ చేసేందుకు ఇద్దరు కార్మికులు అందులోకి ప్రవేశించారని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ భూపేంద్ర సింగ్ కుష్వాహా జాతీయ మీడియాకు తెలిపారు. 

సెప్టిక్ ట్యాంక్‌ను పరిశీలించే క్రమంలో గ్యాస్ పీల్చడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. మరో ముగ్గురు కార్మికులు కూడా అస్వస్థతకు గురైనట్లుగా పీటీఐ నివేదించింది. క్షతగాత్రులందరినీ హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.