చెన్నై: తమిళనాడులో 5 రూపాయల డాక్టర్ అంటే తెలియని వారుండరు. వైద్యోనారాయణోహరి అన్న నానుడికి నిదర్శనం ఆ డాక్టర్ అంటూ అంతా చెప్పుకుంటారు. ముఖ్యంగా వాషర్‌మెన్‌పేట ప్రజల గుండెల్లో గుడికట్టుకున్నారు ఈ 5 రూపాయల డాక్టర్‌. ఆయనే డాక్టర్ జయచంద్రన్. పేదల పెన్నిధిగా, ఆపన్నులకు ఆపద్భాందవుడుగా ఆయన అనేక సంవత్సరాలుగా అసమాన సేవలందిస్తున్నారు.  

ఎంతోమంది నిరుపేదలకు వైద్యం చేసి వారికి ఊపిరి పోసిన ఆయన్ను ఏరోగమో కబలించింది. ఎందరికో ఊపిరిపోసిన ఆయన ఊపిరిని తీసుకుపోయింది. 71 ఏళ్ల జయచంద్రన్  కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. జయచంద్రన్ స్వస్థలం కాంచీపురం జిల్లాలోని కొడైపట్టినం గ్రామం. 1947లో జన్మించిన ఈయన మద్రాసు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వాషర్ మెన్ పేటలో ప్రైవేట్ క్లినిక్ పెట్టి పలు దశాబ్ధాలుగా పేదలకు వైద్య సేవలందిస్తున్నారు. 

జయచంద్రన్ క్లీనిక్  పెట్టిన మెుదట్లో డాక్టర్ ఫీజుగా రెండు రూపాయలు మాత్రమే తీసుకునేవారు. పేషంట్ల నుంచి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఆయన నర్సులు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అంతా ఆయనే చూసుకునేవారు. 

జయచంద్రన్ సేవలను గుర్తించి కొంతమంది నర్సులు ఉచితంగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. స్థానికుల్లో పేదలు, గుడిసెల్లో  జీవించే వారు పెద్ద ఎత్తున ఆయన దగ్గరకు వచ్చేవారు. డాక్టర్ జయచంద్రన్ మరణంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. 

డాక్టర్ జయచంద్రన్ సతీమణి డాక్టర్ వేణి చెన్నై ప్రభుత్వాస్పత్రిలో డీన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. కుమార్తె శరణ్య స్టాన్టీ ఆస్పత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. అటు పెద్దకుమారుడు శరత్ ఓమందూర్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీలో ఆస్పత్రిలో వైద్యం చేస్తుండగా చిన్న కుమారుడు శరవణన్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. 

జయచంద్రన్ మరణంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో నిండిపోయింది. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని వాషర్‌మెన్‌పేటలోని వెంకటేశన్‌ వీధిలో ఉన్న స్వగృహంలో ఉంచారు. మరణ వార్త తెలియగానే తెలియగానే స్థానికులు, పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, ఆయన భౌతికకాయాన్ని చూసి భోరున విలపించారు.