ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం రోజున మావోయిస్టులు జరిపిన పేలుడులో 10 మంది పోలీసులు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ మరణించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం రోజున మావోయిస్టులు జరిపిన పేలుడులో 10 మంది పోలీసులు, వారు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ మరణించిన సంగతి తెలిసిందే. దంతేవాడలోని అరన్‌పూర్ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి సమాచారం అందుకున్న జిల్లా రిజర్వ్ గార్డ్‌కు(డీఆర్‌జీ) చెందిన పోలీసులు అక్కడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది పోలీసు సిబ్బందిలో ఐదుగురు.. పోలీసు దళంలో చేరకముందు మావోయిస్టులుగా పనిచేశారు. ఆ ఐదుగురు నక్సలిజం నుంచి వైదొలిగిన తర్వాత పోలీసులు దళంలో చేరారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

వీరిలో హెడ్ కానిస్టేబుళ్లు జోగా సోడి (35), మున్నా కడ్తి (40), కానిస్టేబుళ్లు హరిరామ్ మాండవి (36), జోగా కవాసి (22), గోప్నియా సైనిక్ (రహస్య దళం) రాజురామ్ కర్తమ్ (25) ఒకప్పుడు నక్సలైట్‌లుగా పనిచేశారు. అయితే వీరు పోలీసులకు లొంగిపోయిన తర్వాత డీఆర్‌జీ దళంలో చేరారని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ తెలిపారు. 

సుక్మా జిల్లాలోని అర్లంపల్లి గ్రామానికి చెందిన సోడి, దంతెవాడలోని ముదేర్ గ్రామానికి చెందిన కడ్తి 2017లో పోలీసులలో చేరారు. అదేవిధంగా దంతెవాడ నివాసితులైన మాండవి 2020లో, కర్తం 2022లో పోలీసు దళంలోకి వచ్చారు. ఇక, దంతేవాడలోని బడే గడం గ్రామానికి చెందిన కవాసి ఈ ఏడాది మార్చిలో డీఆర్‌జీలో చేరారు. 

ఇక, డీఆర్‌జీ సిబ్బందిని మట్టి పుత్రులుగా పిలుస్తుంటారు. డీఆర్‌జీ సిబ్బందిగా స్థానిక యువకులు, బస్తర్ డివిజన్‌లో లొంగిపోయిన మావోయిస్టులను నిమమించారు. బస్తర్ డివిజన్.. మావోయిస్టుల ప్రధాన స్థావరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర పోలీసులకు చెందిన విభాగమైన డీఆర్‌జీ వివిధ కాలాలలో బస్తర్ డివిజన్‌లోని ఏడు జిల్లాలకు పెరిగి.. దాదాపు 40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురిచేసిన లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (LWE) ముప్పుపై పోరాడేందుకు ఇది పనిచేస్తుంది.