శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీరులోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు కూలీలు మరణించారు. ఐదుగురు కూలీలు కూడా స్థానికులు కారు. వారు పశ్చిమ బెంగాల్ కు చెందినవారిగా తెలుస్తోంది.

ఉగ్రవాదుల దాడిలో ఓ కూలీ గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గత రెండు రోజుల్లో ఇది ఆరో ఉగ్రవాద దాడి. దక్షిణ కాశ్మీర్ ను ఉగ్రవాదులు లక్ష్యం చేసుకున్నట్లు భావిస్తున్నారు. కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు దిగ్బంధం చేశాయని, పెద్ద యెత్తున గాలింపు చర్యలు చేపట్టాయని, అదనపు బలగాలు అక్కడికి చేరుకుంటున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసు వర్గాలు ఎఎన్ఐతో చెప్పారు. 

యూరోపియన్ యూనియన్ కు చెందిన 23 మంది పార్లమెంట్ సభ్యులు జమ్మూ కాశ్మీరులో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. జమ్మూ కాశ్మీరుకు ప్రత్యేక హోదాను గ్యారంటీ చేసిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పరిస్థితులను పరిశీలించడానికి వారు పర్యటన చేస్తున్నారు.

ఉగ్రవాదులు సోమవారంనాడు అనంతనాగ్ జిల్లాలో ఓ ట్రక్ డ్రైవర్ ను కాల్చి చంపారు. ఆ ట్రక్ డ్రైవర్ ను జమ్మూలోని కాత్రాకు చెందిన నారాయణ్ దత్ గా గుర్తించారు.