ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పూణే ప్లాంట్‌లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఎన్‌డీఆర్ఎఫ్ ప్రకటించింది.

ప్రమాదం జరిగిన సమయంలో మంటల్లో చిక్కుకున్న వీరు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇదే ఘటనలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.

మరోవైపు ప్రమాదంలో ఐదుగురు మరణించారన్న విషయం తెలుసుకున్న సీరమ్ సీఈవో‌ అదర్ పూనావాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

పుణెలోని మంజరి ప్రాంతంలో వున్న సీరమ్‌ క్యాంపస్‌లో నిర్మాణ దశలో ఉన్న సెజ్‌ 3 భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.  

కరోనాపై పోరులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన భవనం.. కొవిషీల్డ్‌ టీకాలు తయారవుతున్న భవనానికి దూరంగా ఉంది. దీంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని సీరం ప్రకటించింది.