ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద కారుపై కొండచరియలు విరిగిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యాత్రికులు మృతిచెందారు.

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద కారుపై కొండచరియలు విరిగిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యాత్రికులు మృతిచెందారు. ఇక, ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌కు చెందిన ఒకరితో సహా బాధితులు కేదార్‌నాథ్‌కు వెళుతుండగా గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. 

‘‘తర్సలిలో కొండపై నుండి బండరాళ్లతో కూడిన భారీ శిథిలాలు పడటంతో కేదార్‌నాథ్‌గ్యా హైవే 60 మీటర్ల భాగం దెబ్బతినడం, కొట్టుకుపోవడం జరిగింది. ఆ సమయంలో హహనంపై భారీ శిథిలాలు పడటంతో అది పూర్తిగా ధ్వంసం అయింది. శుక్రవారం శిథిలాల కింద చిక్కుకుపోయిన వాహనం కనుగొనబడింది. అందులో నుండి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో ఒకరు గుజరాత్ వాసి’’ అని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని వారు తెలిపారు.

కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే గుప్తకాశీ-గౌరీకుండ్ రహదారిని బ్లాక్ చేశారు. దిగువ ప్రాంతంలోని (చౌకీ జవాడి, కొత్వాలి రుద్రప్రయాగ, చౌకి టిల్వాడ, ఠాణా అగస్త్యముని, కక్డాగడ్) పోలీస్ స్టేషన్ల నుంచి ప్రజలు, ప్రయాణికులు అడ్డంకులు ఎదుర్కొంటున్నారని రుద్రప్రయాగ్ పోలీసులు తెలిపారు.

రుద్రప్రయాగతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని చాలా జిల్లాకు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14 వరకు 'రెడ్' అలర్ట్, 'ఆరెంజ్' అలర్ట్‌లను వాతావరణ శాఖ జారీచేసింది.