కాన్పూర్: హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన పది బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో నాలుగు బోగీలు బోల్తా కొట్టాయి. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ సమీపంలో శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించింది. 

ప్రయాగ్ రాజ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన పూర్వ రైలు కోచ్ లు శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో కాన్పూర్ కు 15 కిలోమీటర్ల దూరంలో గల రూమా గ్రామం వద్ద పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో కోచ్ లు దెబ్బ తిన్నాయి. అర్థరాత్రి ప్రమాదంతో ప్రయాణికులు వణికిపోయారు.

ప్రమాదానికి జరిగిన సమాచారం అందిన వెంటనే 15 అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన 45 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.