ఆగ్రా: సెప్టిక్ ట్యాంకులో పడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు మైనర్ సోదరులున్నారు. ఈ విషాదకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో గల ఫతేబాద్ ప్రాంతంలో మంగళవారంనాడు చోటు చేసుకుంది. 

ఫతేబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రతాప్ పుర గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో తొలుత పదేళ్ల బాలుడు అనురాగ్ ఆడుకుంటూ వెళ్లి సెప్టిక్ ట్యాంకులో పడ్డాడు. అతన్ని కాపాడడానికి ప్రయత్నించి మిగతావారు మృత్యువాత పడ్డారు. 

మృతులను సోను (25), రామ్ ఖిలాడి, హరిమోహన్ (16), అవినాష్ (12)లుగా గుర్తించారు. హరిమోహన్, అవినాష్, అనురాగ్ సోదరులు. వారిని గ్రామస్తులు సెప్టిక్ ట్యాంకులోంచి వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

సంఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలేసి నష్టపరిహారం ప్రకటించారు. మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు.