మణిపూర్ ప్రభుత్వోద్యోగులకు ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలు వారానికి ఐదు రోజులే పనిచేయనున్నాయి. అలాగే సీజన్ల వారీగా కార్యాలయాల పని వేళలను కూడా ప్రకటించింది.
రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మణిపూర్ సీఎం (manipur) బిరెన్ సింగ్ (biren singh) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పని దినాలను (Manipur govt offices) ఐదు రోజులకు కుదించారు. ఈ మేరకు మార్చి 22న బిరెన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో (manipur cabinet) ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని మణిపూర్ ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సునంద తోక్చోమ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఒక్క వెకేషన్ డిపార్ట్‌మెంట్ మినహా.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఎజెన్సీలు, విభాగాలు, ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని యాజమాన్యాలు ఏప్రిల్ 1 నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి.
ఇక ఆయా కార్యాలయ సమాయాలను కూడా ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం.. ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అవి పని చేస్తాయి. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇది వర్తించనుంది. ఇక శీతాకాలమైన నవంబర్-ఫిబ్రవరిలల్లో అరగంట తగ్గించి ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కార్యాలయాలు విధులు నిర్వర్తిస్తాయి.
ఇకపోతే.. ఇటీవల జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో (manipur assembly election) బీజేపీ (bjp) ఘన విజయం సాధించింది. 60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాలతో మెజారిటీ మార్కు సీట్లను సాధించింది. రాష్ట్రంలో 31 స్థానాలు గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. దీంతో సునాయాసంగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా.. మిత్ర పక్షాల మద్దతు తీసుకుంటోంది. కాగా 2017లో మణిపూర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో విఫలం అయ్యింది.
ఆ ఎన్నికల సమయంలో 27 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా.. ప్రస్తుతం ఆ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారంతా అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఉన్న పరిస్థితే మణిపూర్ లోనూ ఉంది. బలమైన కాంగ్రెస్ నాయకులు లేకుండానే ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగింది. అయితే కాంగ్రెస్ కు బలమైన నాయకుడు అయిన ఓక్రమ్ ఇబోబి సింగ్ గత రెండు నెలల్లో ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. అయితే గత ఐదేళ్లలో ఆయన ప్రతిపక్షహోదాలో గట్టిగా పోరాడలేదు. అందుకే ఈ సారి కూడా ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీగానే మిగిలిపోయింది.
