తమిళనాడు లో రామేశ్వరంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పధార్థాలు లభించాయి. ఓ వ్యక్తి తన సొంత స్థలంలో ఓ నిర్మాణం కోసం తవ్వకాలు జరపగా ఈ పేలుడు పదార్థాలు బైటపడ్డాయి. దీంతో కంగారుపడిపోయిన అతడు పోలీసులకు సమాచారం అందించాడు. 

తమిళనాడు రామంతాపురం జిల్లా కు రామేశ్వరం కు చెందిన ఓ మత్స్యకారుడు తన ఇంటి వద్ద ఓ నిర్మాణం చేపట్టేందుకు తవ్వకాలు జరిపాడు. సముద్ర తీరంలోని కొబ్బరి తోటలో ఓ ఐదడుగుల లోతు తవ్వేవరకు భారీగా పెట్టెలు బైటపడ్డాయి. దీంతో అతడు ఎంతో ఆసక్తిగా ఆ పెట్టెను తెరిచిచూడగా అందులో భారీ సంఖ్యలో ఎకె47 తుపాకీలు, అందులో వాడే బుల్లెట్లు, బాంబులు, మరి కొంత మందుగుండు సామాగ్రి లభించింది. కంగారుపడిపోయిన అతడు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించాడు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని ఎంతో శ్రమించి జాగ్రత్తగా బైటికి తీశారు. ఆ పెట్టెలను తెరిచి చూడగా భారీ ఎత్తున ఆయధాలు కనిపించాయి. దాదాపు 5వేల బుల్లెట్లతో పాటు, వందల కేజీల మందుగుండు సామగ్రి బయటపడటంతో స్థానికులతో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. 

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఓంప్రకాశ్ మీనా మాట్లాడుతూ...బైటపడ్డ పేలుడు పధార్థాలు శ్రీలంక కు చెందిన ఎల్టీటీఈ కి సంబంధించినవిగా బావిస్తున్నట్లు తెలిపారు. 1983-90ల మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని  ఎల్టీటీఈ శిక్షణా కేంద్రంగా వాడుకుని ఉండవచ్చని, అప్పుడే ఇవి ఇక్కడ డంప్ చేసి ఉంటారని వివరించారు. ప్రస్తుతం ఇవి తుప్పుపట్టిపోయి ఉన్నాయని ఎస్పీ  తెలిపారు.