స్టేషనరీపై వున్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని కౌన్సిల్‌లో నిర్ణయించినట్లు చెప్పారు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ భేటీకి దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. స్టేషనరీపై వున్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో పెన్సిల్, షార్పనర్ తదితర స్టేషనరీ వస్తువుల ధరలు దిగిరానున్నాయి. అంతేకాకుండా రాష్ట్రాలకు జూన్ నాటికి వున్న రూ.16,982 కోట్ల జీఎస్టీ బకాయిలను చెల్లించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల తెలిపారు.
అలాగే ఆలస్యంగా జీఎస్టీ ఫైల్ చేస్తే విధించే పెనాల్టీని సవరించాలని కౌన్సిల్‌లో నిర్ణయించినట్లు చెప్పారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌పై చర్చలు జరిపామని.. దీనిలో ఇద్దరు న్యాయమూర్తులు వుండాలని ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కంటైనర్లకు అతికించే ట్యాగ్‌లు, ట్రాకింగ్ పరికరాలు, డేటా లాగర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి సున్నాకు తగ్గించగా.. బెల్లం పాకంపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి వెల్లడించారు.
