ఓ గంటలో ఎన్ని వంటకాలు చేయచ్చు..? కావల్సినవన్నీ కోసి రెడీగా ఉంటే, బాగా చేయి తిరిగిన వంటగాళ్లైతే... ఓ నాలుగైదు..లేదా ఓ పది వరకు ఈజీగా లాగించేస్తారు. కదా... కానీ ఓ చిన్నారి అదీ గంటలోపు అంటే 58 నిమిషాల్లో ఏకంగా 46 రకాల వంటకాలు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 

వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఎస్‌ఎన్‌ లక్ష్మి సాయిశ్రీకి చిన్నప్పటి నుంచి వంటచేయడం అంటే ఆసక్తి. తల్లితో పాటు ఎప్పుడూ వంటింట్లోనే ఉంటుండేది. ఈ క్రమంలో కూతురి ఆసక్తి గమనించిన తల్లి వంటలో ట్రైనింగ్ ఇచ్చింది. అలా ఈ లక్ష్మి ఇప్పుడు యునికో బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 

దీనికి లక్ డౌన్ కాలం బాగా కలిసొచ్చిందని చెబుతున్నారు లక్ష్మి తల్లిదండ్రులు. ఈ టైంలో కొత్త కొత్త వంటకాలు చేయడం మొదలుపెట్టారట. వంటకాట చేయడం పట్ల చిన్నారికున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు..ఈ హాబీతో రికార్డు సృష్టించాలని భావించారు. 

ఈ మేరకు సాయిశ్రీ తండ్రి ఆన్‌లైన్‌లో పరిశోధన చేసి.. కేరళకు చెందిన పదేళ్ల అమ్మాయి శాన్వి సుమారు 30 వంటలు వండినట్లు గుర్తించారు. తన కుమార్తెతో ఆ రికార్డును బద్దలు కొట్టాలనుకున్నారు. అలా 58 నిమిషాల్లో 46 రకాల వంటలు చేసి యునికో రికార్డు సాధించారు.  

తాను తమిళనాడులోని విభిన్న సాంప్రదాయ వంటలు వండుతానని, లాక్‌డౌన్‌ సమయంలో నా కుమార్తె నాతోనే వంట గదిలో గడిపేదని, నా భర్తతో వంట చేయడానికి సాయిశ్రీ ఆసక్తిపై చర్చించి ప్రపంచ రికార్డ్‌ కోసం ప్రయత్నించామని సాయిశ్రీ తల్లి కలైమగల్‌ తెలిపారు. ప్రపంచ రికార్డును సృష్టించిన చిన్నారి సాయిశ్రీని పలువురు అభినందించారు.