వ్యాపార నిమిత్తం విమానం ఎక్కి యూరప్ వెళ్లాల్సిన వ్యక్తి... కారు మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యాడు. ఈ విషాదకర సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

దేశరాజధాని ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ గుప్త(42) వ్యాపార నిమిత్తం గురువారం రాత్రి యూరప్ వెళ్లాల్సి ఉంది. కాగా... ఆయన గురువారం రాత్రి తన మహీంద్రా ఎస్ యూవీ 500 వాహనంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాడు.  ఆయన వాహనం ముకబ్రా చౌక్ ఫ్లైఓవర్ కి చేరుకునే సరికి కారులో మంటలు చెలరేగాయి.

వెంటనే ఆయన కారులో నుంచి బయటకు రావాలని ప్రయత్నించారు. కానీ కారు డోర్లు తెరుచుకోలేదు. దీంతో ఆయన ఆ మంటల్లో కాలి బూడిద కావాల్సి వచ్చింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా... వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా... అప్పటికే అజయ్ గుప్త మంటల్లో పూర్తిగా కాలిపోయారు.

కాలిపోయిన ఆయన శవాన్ని పోలీసులు బయటకు తీశారు. కాగా... అకస్మాత్తుగా కారులో మంటలు ఎందుకు చెలరేగాయి అన్న విషయంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెరగేసరికి కారు ఆటోమెటిక్ లాక్ సిస్టమ్ లాక్ అయిపోయిందని...దీంతో ఆయన బయటపడే అవకాశం లేకుండా పోయిందని పోలీసులు చెప్పారు.  ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.