జూన్ నెల సగం పూర్తికావోస్తున్నా దేశవ్యాప్తంగా భానుడి భగభగలు తగ్గకపోగా... అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బీహార్‌లో వేడి గాలుల ధాటికి శనివారం ఒక్కరోజే దాదాపు 40 మంది మరణించారు.

ఔరంగాబాద్, గయ, నవాడా ప్రాంతాల్లో అధ్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరణించిన వారిలో 40 సంవత్సరాలు దాటిన వారు ఎక్కువగా ఉన్నారు. ఎండల కారణంగా పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడగా చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.

మరోవైపు వడదెబ్బలపై ప్రజలు మరణించడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. ఒక్కో వ్యక్తికి రూ. 4 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.