కర్ణాటకలో నలభైమంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీకి చెందిన ఈ విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్ గా తేలడంతో కళాశాలకు సీల్ వేశారు.

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు ఉల్లాల్ ప్రాంతంలోని  ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులో నమోదవ్వడం భయాందోళనలకు గురి చేస్తుంది. 

ఈ విద్యార్థినులంతా కేరళ నుంచి వచ్చినవారే. దీంతో వెంటనే నర్సింగ్ కాలేజీతో పాటు ఆస్పత్రిని మూసివేయాలా ఉల్లాల్ మున్సిపల్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన నర్సింగ్ కాలేజీనీ ఉల్లాల్ మున్సిపాలిటీ కమిషనర్ సందర్శించి, అనంతరం సీలు వేశారు. 

అంతేకాదు పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన నర్సింగ్ కాలేజీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. కర్ణాటక రాష్ఠ్రంలో తాజాగా 5,943 కేసులు వెలుగుచూశాయి.