భారత్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతోంది. ఈ ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. 

భారత్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతోంది. 2019లో సరిగ్గా ఇదే రోజున(ఫిబ్రవరి 14) పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరవీరులయ్యారు. పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా.. అమరులైన సైనికులకు దేశ ప్రజలు నివాళులర్పిస్తున్నారు. అమరవీరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వారి అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.

‘‘పుల్వామాలో ఇదే రోజున మనం కోల్పోయిన మన వీర వీరులను స్మరించుకుంటున్నాను. వారి అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి వారి ధైర్యం మనల్ని ప్రేరేపిస్తుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన ఉగ్రవాదులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా నివాళులర్పించారు. ‘‘2019 సంవత్సరంలో ఈ రోజున పుల్వామాలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నేను నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. వారి పరాక్రమం, అలుపెరగని ధైర్యసాహసాలు ఉగ్రవాదంపై పోరులో ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి’’ అని అమిత్ షా ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Scroll to load tweet…


అసలేం జరిగిందంటే.. 
2019 ఫిబ్రవరి 4,న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని లెత్‌పోరా వద్ద జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. పుల్వామా స్థానిక నివాసి అయిన ఆదిల్ అహ్మద్ దార్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. ఆత్మాహుతి దాడి జరపడంతో అతడు కూడా హతమయ్యాడు. ఆదిల్ అహ్మద్ దార్ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జేఎం)కి అనుబంధంగా పనిచేసేవాడు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి చేసినట్టుగా దర్యాప్తులో తేలింది. ఇక, ఇందుకు ప్రతీకార దాడిలో భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది.