బ్రిటన్ నుంచి భారత్ కు వస్తున్న ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే యూకేనుంచి వచ్చిన వారిలో పాజిటివ్ తేలిన వారిని ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్ లో ఉంచారు. తాజాగా ఒడిశాలోని భువనేశ్వర్ లో బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారికి కరోనా పాజిటివ్ తేలింది. ఆశ్చర్యం ఏంటంటే తల్లిదండ్రులకు నెగటివ్ వచ్చింది. 

ఈ నాలుగేళ్ల చిన్నారి డిసెంబర్ 20న తల్లిదండ్రులతో కలిసి భువనేశ్వర్ కు వచ్చింది. అయితే బ్రిటన్ లో కొత్తరకం వైరస్ నేపథ్యంలో ఒడిశా అధికారులు వీరి కుటుంబానికి కూడా కరోనా టెస్టులు చేశారు. రిజల్ట్స్ చూసి తల్లిదండ్రులతో పాటు అధికారులూ షాక్ అయ్యారు. 

చిన్నారికి పాజిటివ్ రాగా, తల్లిదండ్రులకు నెగటివ్ వచ్చింది. దీంతో ఈ కుటుంబాన్ని క్వారంటైన్ లో ఉంచారు. అయితే పాపకు వచ్చింది పాత వైరసా? కొత్తదా? అనేది ఇంకా తేలలేదు. దీనికోసం పాప బ్లడ్ శాంపిల్స్ ను వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఇక పాప తల్లిదండ్రులకు శనివారం మరోసారి పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఒడిశాలో ఇటీవల యూకేనుంచి వచ్చిన మరో వ్యక్తికి కూడా కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో అతని బ్లడ్ శాంపిల్స్ ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. బ్రిటన్ లో జన్యుమార్పిడి జరిగిన కరోనా వైరస్ బయట పడడంతో ప్రపంచదేశాలన్నీ అప్పమత్తమయ్యాయి. పలు దేశాలు విమాన సర్వీసులు నిలిపివేశాయి. భారత్ లో ఈ నెల 23 నుంచి 31 వరకు బ్రిటన్ కు విమాన రాకపోకలను తాత్కలికంగా రద్దు చేశారు.