ఎండవేడి తట్టుకోలేక నలుగురు ప్రయాణికులు రైలులోనే మృతి చెందిన సంఘటన ఝాన్సీలో చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కేరళ ఎక్స్ ప్రెస్ రైలు సోమవారం ఝాన్సీ చేరుకునే సమయానికి ఎండవేడి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. కాగా... గమనించిన అధికారులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా... వారిలో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. కాగా.. అతని పరిస్థితి కూడా విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. 

వీరంతా 65ఏళ్ల పైబడినవారేనని అధికారులు చెప్పారు. వారి మృతికి నిజంగా ఎండవేడే కారణామా.. లేదా ఇంకేదైనా కారణముందా అనే విషయం తెలుసునేందుకు వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం  ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. 

వారణాసి, ఆగ్రాలను సందర్శించేందుకు బయలుదేరిన బృందంలో వీరు సభ్యులు. "మేమందరం ఆగ్రా చూసి వస్తున్నాం. రైలు బయలుదేరిన కొద్ది సేపటికే ఎండవేడి తట్టుకోలేనంతగా పెరిగిపోయింది. ఊపిరాడట్లేదు, ఇబ్బందిగా ఉంది అంటూ కొంతమంది ప్రయాణికులు చెప్పారు. కానీ సహాయం వచ్చేలోపే వారు కుప్పకూలిపోయారు." అంటూ బృందంలోని సభ్యుడొకరు జరిగిన విషయాన్ని చెప్పారు.