జమ్మూకశ్మీర్‌లో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో..నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లా సోపర్ పట్టణంలో టెర్రరిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి.

ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.దీంతో సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమైనట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది టెర్రరిస్టులు ఇంకా నక్కి ఉండటంతో సైన్యం వారిని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

మరోవైపు దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం నుంచి సైన్యం ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ప్రారంభించింది. జైషే కమాండర్లు పండూషన్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి.

ఈ క్రమంలో సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని మంజూర్ భట్, జీనత్ ఇస్లాం నైకూగా గుర్తించారు. ఘటనాస్థలి నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.