గుజరాత్ రాష్ట్రంలోని ఒద్ధావ్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల పాత భవనం కుప్పకూలింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో పది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని ఒద్ధావ్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల పాత భవనం కుప్పకూలింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో పది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
శిథిలాల కింది నుంచి నలుగురిని సహాయ బృందాలు రక్షించాయి. భవనం కూలిన సమాచారం అందిన వెంటనే ఐదు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ భవనాన్ని రెండు దశాబ్దాల క్రితం నిర్మించారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భవనంలో మొత్తం 32 ఫ్లాట్స్ ఉన్నాయి. గతంలో భవనానికి నోటీసు జారీ చేసి, అందులోంచి ప్రజలను ఖాళీ చేయించారు. అయితే, ఆదివారంనాడు అందులోకి కొంత మంది ఎలా ప్రవేశించారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు.
సంఘటన జరిగిన తర్వాత గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ కు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన రెండు బృందాలు బయలుదేరి వచ్చాయి. నగర పాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు గుజరాత్ హోం మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా చెప్పారు.
