తమిళనాడులో కరూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మయనూర్ గ్రామం వద్ద కావేరిలో నదిలో నలుగురు స్కూల్ విద్యార్థినులు గల్లంతయ్యారు. 

తమిళనాడులో కరూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మయనూర్ గ్రామం వద్ద కావేరిలో నదిలో నలుగురు స్కూల్ విద్యార్థినులు గల్లంతయ్యారు. అయితే వారిని కాపాడేందుకు స్థానికులు, రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వివరాలు.. పుదుకోట్టై జిల్లా విరాలిమలైలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నలుగురు విద్యార్థినులు తమిళరసి (8వ తరగతి), సోఫియా(7వ తరగతి), ఇనియా(6వ తరగతి), లావణ్య (6వ తరగతి)లు.. ఓ ప్రైవేట్ కాలేజ్‌లో జరిగిన ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొని బుధవారం సైట్ సీయింగ్ కోసం మయనూరు వచ్చారు.

నలుగురు విద్యార్థినులు మయనూరు వద్ద కావేరి నదిలో స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నలుగురు విద్యార్థినులు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం స్థానికుల సహకారంతో నలుగురు విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యార్థినుల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన స్టాలిన్.. వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రజా సహాయ నిధి నుంచి రూ.రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది.