మరో కరోనా ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల ముంబయిలోని ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగి పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరవకముందే మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నాగ్ పూర్ లోని ఓ కరోనా ఆస్పత్రిలో అగ్నికీలలకు నలుగురు బలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో కనీసం నలుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. నగరంలోని వెల్‌ట్రీట్ హాస్పిటల్‌లో 27 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశం వుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి. 

కాగా... ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోని ఏసీ యూనిట్ నుంచి ముందుగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. అది 30 పడకల ఆస్పత్రి కాగా.. వాటిలో 15 ఐసీయూ వార్డులోని బెడ్స్ గా ఏర్పాటు చేశారు. ప్రమాదం అనంతరం 27మంది రోగులను ఇతర ఆస్పత్రులను తరలించామని... వారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పడం కష్టంగా ఉందని అక్కడి పోలీసు అధికారులు తెలిపారు

ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన దేవుడిని ప్రార్థించారు. 

కాగా, గతనెలలో ముంబైలోని భాండప్‌ ప్రాంతంలోని డ్రీమ్స్‌ మాల్‌లో సన్‌రైజ్‌ హాస్పిటల్‌ ఉన్నది. మాల్‌లోని మూడో అంతస్థులో ఉన్న ఈ కొవిడ్‌ సెంటర్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. దాదాపు 23 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 76 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 73 మంది కరోనా బాధితులు ఉన్నారు.