Asianet News TeluguAsianet News Telugu

గ్యాస్ లీక్: తెలియక లైట్ వేయగా, సిలిండర్ బ్లాస్ట్.. ఏడుగురి సజీవదహనం

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మాదాబాద్‌లో సిలిండర్ పేలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా వుండటం దురదృష్టకరం. 
 

4 Children Among 7 Killed In LPG Cylinder Blast Near Ahmedabad ksp
Author
Ahmedabad, First Published Jul 24, 2021, 4:44 PM IST

గుజరాత్‌లో దారుణం జరిగింది. అహ్మాదాబాద్‌లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలు తమ కుటుంబ సభ్యులతో అహ్మదాబాద్ శివార్లలోని ఓ గదిలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఉన్నట్లుండి వంట గ్యాస్ లీక్ అయ్యింది. ఆ గది నుంచి గ్యాస్ వాసన వస్తుండటాన్ని గుర్తించిన పొరుగింటి వారు.. వారిని అప్రమత్తం చేయడానికి ఆ ఇంటి తలుపు తట్టారు. నిద్ర నుంచి మేల్కోన్న ఓ వ్యక్తి వెంటనే లైట్ ఆన్ చేశాడు. అయితే అప్పటికే లీకైన గ్యాస్ అప్పటికే గదంతా విస్తరించడంతో.. లైట్ ఆన్ చేయగానే గదిలో మంటలు వ్యాపించాయి. ఆ మంటలకు సిలిండర్ కూడా పేలిపోయింది.

ప్రమాద సమయంలో ఆ గదిలో పది మంది నిద్రిస్తున్నారు. ప్రమాదం జరగగానే మంటల్లో కాలుతూ ఒక్కొక్కరూ బయటకు పరుగెత్తుకొచ్చారు. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రాత్రి ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో నలుగురు శుక్రవారం తుది శ్వాస విడిచారు. మృతి చెందిన వారిలో పురుషులతో పాటు మహిళలు, చిన్నారులు ఉన్నారు.

మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులందరూ మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లా మధుసూదన్‌గర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరణించిన వారిని రాంప్యారి అహిర్వర్ (56), రాజుభాయ్ అహిర్వర్ (31), సోను అహిర్వర్ (21), సీమా అహిర్వార్ (25), సర్జు అహిర్వర్ (22), వైశాలి (7), నితేష్ (6), పాయల్ (4) ), మరియు ఆకాష్ (2)గా  తెలిపారు. ఈ ఘటన పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స కోసం మరో 2 లక్షల రూపాయలు ప్రకటించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios