ఢిల్లీలో గురువారం భూకంపం వచ్చింది. ఇది 4.2 తీవ్రతగా నమోదయ్యింది. దీంతో జనాలు భయంతో ఇళ్లనుండి పరుగులు పెట్టారు. ఈ భూకంపం హర్యానాలోని గుర్గావ్‌కు నైరుతి దిశలో 48 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది.

ఈ భూకంపం రాత్రి 11.46 గంటలకు సంభవించింది. ఇది భూమినుంచి .5 కిలోమీటర్ల లోతులో వచ్చింది. దీని ప్రభావంతో కొన్ని సెకండ్ల పాటు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. బలమైన ప్రకంపనలు వచ్చాయి. 

అయితే ఈ భూకంపం వల్ల ఏమైనా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందా అనే దానిపై ఇంకా వివరాలు తెలియలేదు. ఈ భూకంపం గురించి సోషల్ మీడియాలో #Earthquake అనే యాష్ ట్యాగ్ తో ఈ ట్రెండ్ అవుతోంది. 

అయితే ఢిల్లీ  ఫాల్ట్‌లైన్‌కు దగ్గరగా ఉండడం వల్ల పెద్ద భూకంపాలు కూడా వచ్చే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏప్రిల్ 12 నుండి ఇప్పటివరకు ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) దాదాపు 20 భూకంపాలను నమోదు చేసింది.

ఢిల్లీ సెస్మిక్ జోన్ IV లోకి వస్తుంది. అంటే చాలా ఎక్కువ రిస్క్ ఉన్న జోన్ అన్నమాట. భూకంప తీవ్రత, పౌన:పున్యాల ప్రకారం చూస్తే దేశం నాలుగు భూకంపమండలాలుగా విభజింపబడింది. అవి II, III, IV మరియు V లుగా విభజించారు. ఇందులో ఢిల్లీ IV జోన్ లో ఉంది. 

ఒకవేళ ఢిల్లీలో భూకంప తీవ్రత గనక 6గా వచ్చినట్లైతే.. భద్రతా నిబంధనలను పాటించని పెద్ద నిర్మాణాలు కూల్చివేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.