కేరళ బోటు దుర్ఘటనలో గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. తానూరు పరిధిలోని తువ్వలతీరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడింది. పడవలో 37 మంది ఉండగా, అందులో 22 మంది మరణించారు.
కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన పడవ ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం బుధవారం ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 22 మంది మరణించారు. ఈ కమిషన్‌కు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీకే మోహనన్ నేతృత్వం వహిస్తుండగా.. నీలకందన్ ఉన్ని (రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా), సురేష్ కుమార్ (కేరళ ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సాంకేతిక నిపుణులు) సభ్యులుగా ఉంటారు.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ముఖ్యమంత్రి మలప్పురంలోని ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. దీనితో పాటు క్షతగాత్రుల చికిత్స, సహాయక చర్యల కోసం 25 లక్షల రూపాయల మొత్తాన్ని కూడా ఆమోదించారు.
దీంతో పాటు క్షతగాత్రుల తదుపరి చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తానూరు పరిధిలోని తువ్వలతీరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తా పడింది. పడవలో 37 మంది ఉండగా, అందులో 22 మంది మరణించారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు కేరళ పోలీసులు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
