ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి దాదాపు 39మంది బాలికలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా.. వారిలో 35 మంది మళ్లీ సురక్షితంగా వసతి గృహానికి చేరుకోగా... నలుగురు మాత్రం అదృశ్యమయ్యారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం జలందర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వసతి గృహం నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన అమ్మాయిల్లో చాలా మంది 18ఏళ్ల లోపు వారేనని అధికారులు చెబుతున్నారు. వారంతా ప్రభుత్వ సంరక్షణలో ఉన్నారు. అయితే.. వాళ్లు మేజర్లు కాకముందే.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లి స్వేచ్ఛగా బ్రతకాలని భావించారని.. అందుకే తప్పించుకునే ప్రయత్నం చేశారని అధికారులు చెప్పారు. కాగా.. వారు మేజర్లు అయిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లే అధికారం ఉందని వారు పేర్కొన్నారు.

అయితే.. వారిలో 18ఏళ్లు నిండిన వాళ్లు కూడా ఉన్నారు. వారిని కూడా వసతి గృహం నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని సదరు యువతులు ఆరోపిస్తున్నారు. అయితే.. వాళ్లు అలా అక్కడి నుంచి వెళ్లాలంటే.. దాని కంటూ చట్టపరంగా ఓ ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే వాళ్లు వెళ్లాలని వారు చెబుతున్నారు. తాము వారికి అందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చామని అధికారులు చెప్పారు.

"వసతి గృహంలో 81 మంది బాలికలు ఉన్నారు. 39 మంది తప్పించుకున్నారు. అయితే.. నలుగురి ఆచూకీ మాత్రం లభించలేదు.. సిబ్బంది యొక్క అక్రమ ప్రవర్తనను ఆరోపిస్తూ వారు అలా పారిపోవడానికి ప్రయత్నించినట్లు సదరు బాలికలు మాకు చెప్పారు" అని జలంధర్ పోలీసు అధికారి జగ్జిత్ సింగ్ చెప్పారు.