Asianet News TeluguAsianet News Telugu

అక్రమ దారిలో అమెరికా వెళ్లాలనుకున్నారు! టర్కీలో 37 గుజరాతీ కుటుంబాలు ‘మిస్సింగ్’.. మాఫియానే కిడ్నాప్ చేసిందా?

అమెరికాకు అక్రమ మార్గాల్లో వెళ్లాలని ప్రయత్నించి టర్కీ చేరుకుని మొత్తం 136 మంది గుజరాతీలు మిస్ అయినట్టు తెలిసింది. అధికారిక అనుమతులు లేకుండా మానవ అక్రమ రవాణా మాఫియా ద్వారా ముందుగా మన దేశం నుంచి టర్కీకి, అక్కడి నుంచి నకిలీ పాస్‌పోర్టులతో మెక్సికోకు, అక్కడి నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్లాలని ఆ గుజరాతీ కుటుంబాలు టర్కీ దాకా చేరాయి. కానీ, అక్కడ కనిపించకుండా పోయాయి లేదా ఆ మాఫియానే వారిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ మాఫియా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ వారి కుటుంబాలకు ఫోన్లు చేసినా.. వారు పోలీసు ఫిర్యాదు ఇవ్వడం లేదు.

37 gujarati families missing in turkey they may tried to go america through dangerously illegal rout
Author
First Published Mar 14, 2022, 4:10 PM IST

న్యూఢిల్లీ: అమెరికా చాలా మందికి ఇప్పటికీ డ్రీమ్ కంట్రీగానే ఉన్నది. ఎలాగైనా అమెరికా చెక్కేయాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం తీవ్ర కృషి చేస్తారు. అవసరమైన అర్హతలు సంపాదించే పనిలో మునిగిపోతారు. కానీ, ఇంకొందరు అత్యంత ప్రమాదకరమైన అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటాలని పథకాలు వేస్తుంటారు. ఏ మాత్రం ప్లాన్ బెడిసి కొట్టినా అది వారి ప్రాణాలనే ముప్పులోకి నెట్టేస్తున్నది. ఇలా అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ఎంటర్ కావాలని ప్రయత్నంచి మన దేశం దాటి టర్కీ వరకు చేరుకున్న 37 గుజరాతీ కుటుంబాలు కనిపించకుండా పోయాయి.

తీగ లాగితే డొంక కదిలినట్టు తొలుత రెండు జంటలు, ఇద్దరు పిల్లలే మిస్సింగ్ అని భావించారు పోలీసు అధికారులు. కానీ, క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు గుజరాత్‌కు చెందిన 37 కుటుంబాలు మిస్ అయినట్టు తెలిసింది. అంటే మొత్తం సుమారు 136 మంది గుజరాతీలు అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లాలని ప్రయత్నించి టర్కీలో కనిపించకుండా పోయారు. బహుశా వారిని మానవ అక్రమ రవాణా చేసే ముఠా కిడ్నాప్ చేసి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. గుజరాత్‌లోని స్మగ్లింగ్ రాకెట్ కూడా బయటికి వస్తున్నది.

గుజరాత్‌లోని కలోలో తాలూకాకు చెందిన ఓ గ్రామం నుంచి రెండు జంటలు, ఇద్దరు పిల్లలు జనవరిలో దేశం దాటిన తర్వాత టర్కీలో కనిపించకుండా పోయారు. వారి గురించి అధికారులు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని ఊహించని విషయాలు బయటపడ్డాయి. భారత్ నుంచి టర్కీ, టర్కీ నుంచి మెక్సికో, మెక్సికో నుంచి సరిహద్దు దాటి అమెరికాకు చేరే అక్రమ మార్గం ఒకటి ఉన్నది. ఈ మార్గంలోనే అమెరికాకు చేరాలని టర్కీ చేరుకున్నాక కనిపించకుండా పోయిన మరో 18 మంది గుజరాతీల గురించి తెలిసింది.ఆ సంఖ్య అక్కడితో ఆగలేదు. తదుపరి దర్యాప్తులో మరో 37 గుజరాతీ కుటుంబాలు(112 మంది) కూడా కనిపించకుండా పోయినట్టు తేలింది. గాంధీ నగర్, మెహసనా, అహ్మదాబాద్ జిల్లాల నుంచి ఈ 112 మంది టర్కీ చేరుకున్నారు. ఇస్తాంబుల్‌లో ల్యాండ్ అయిన తర్వాత వారు మిస్ అయినట్టు సమాచారం అందింది.

తొలుత తాము ఆరుగురు మిస్ అయ్యారనే భావించామని, కానీ, దర్యాప్తు మొదలైన తర్వాత మరో 18 మంది.. ఆ తర్వాత ఇంకో 112 మంది అక్రమ మార్గంలో అమెరికా చేరాలని టర్కీ వెళ్లాక అదృశ్యమయ్యారని తెలిసిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వారు మిస్ అయిపోవాలి లేదా టర్కీలోని మాఫియా వారిని కిడ్నాప్ చేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు. ఈ 37 కుటుంబాలు జనవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య టర్కీకి వెళ్లారని పోలీసులు చెప్పారు. గుజరాత్‌లోని కొందరు ఏజెంట్లు విదేశాల్లోని అధికారులు, మాఫియాతో సంబంధాలు కలిగి ఉంటారని తెలిపారు. చట్టబద్ధమైన అనుమతులు లేకున్నా.. అమెరికా చేరడానికి ఇక్కడి నుంచి ముందుగా టర్కీకి పంపుతారని చెప్పారు. అక్కడ నకిలీ పాస్ పోర్టులతో మెక్సికోకు తరలిస్తారని, ఆ తర్వాత మెక్సికోలోని హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా లేదా ఏజెంట్లు వారిని అమెరికాలోకి అక్రమంగా స్మగుల్ చేస్తారని వివరించారు.

ఈ కేసులో గుజరాత్‌ నుంచి వెళ్లిన కుటుంబాలను మానవ అక్రమ రవాణా మాఫియా నిర్బంధించిందని అధికారులు చెప్పారు. మాఫియా నుంచి పెద్ద మొత్తంలో అంటే రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు డబ్బు అరేంజ్ చేయాలని వారి బంధువులకు ఫోన్‌లు వచ్చినట్టు వివరించారు. ఆ కుటుంబ సభ్యులు పోలీసు ఫిర్యాదు ఇవ్వడానికి జంకుతున్నారని, అది తమ ఆప్తులను మరింత ముప్పులోకి నెట్టవచ్చని భయపడుతున్నారని చెప్పారు.

సాధారణంగా అక్రమంగా అమెరికా చేరాలనుకునే వారు టర్కీకి వెళ్లగానే వారిని మూడు నుంచి ఆరు నెలలు టర్కీలో అద్దె గదుల్లో ఉంచుతారని, మెక్సికో నుంచి మాఫియా లేదా వారి ఏజెంట్ల నుంచి క్లియరెన్స్ వచ్చాక అక్కడికి నకిలీ పాస్ పోర్టుల మీద పంపిస్తారని అధికారులు చెప్పారు. ఒక వేళ వారు సేఫ్‌గా టర్కీ నుంచి మెక్సికో చేరినా.. అక్కడా ఆ మాఫియా ద్వారా టార్చర్ పొందే అవకాశం ఉన్నదని, వారికి సరిపడా ఖర్చులను గుజరాత్ ఏజెంట్లు అందించకున్నా.. ఈ టార్చర్ తప్పదని వివరించారు. 

కెనడా సరిహద్దు నుంచి అక్రమంగా అమెరికా చేరాలనుకుని మంచులో గడ్డకట్టుకుపోయిన గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం ఉదంతం బయటపడగానే గుజరాత్‌లోని ఈ ఏజెంట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios