నోరు లేని మూగ జీవాల పట్ల జాలి చూపించాల్సింది పోయి.. వాటిని దారుణంగా చంపుతూ పైశాచిక ఆనందం పొందే వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి సిక్కింలో జరిగింది.

బంధువులతో గొడవ పడిన ఓ వ్యక్తి వారి పెంపుడు కుక్కను హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. తూర్పు సిక్కింలోని మానే దారా గ్రామానికి చెందిన నరెన్ తమంగ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 3న నరెన్‌కు అతడి బంధువుకు మధ్య చిన్న వివాదం జరిగింది. ఆ కోపాన్ని నిందితుడు అతడి పెంపుడు కుక్క మీద చూపించాడు. దానిని దారుణంగా హత్య చేసి.. అనంతరం సాక్ష్యాలను దాచేందుకు గాను కుక్క మృతదేహాన్ని కొండపై నుంచి విసిరేశాడు.

బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్క మృతదేహాన్ని గుర్తించి. దానికి పోస్ట్‌‌మార్టం నిర్వహించిన డాక్టర్లు సైతం నరెన్ పైశాచికత్వానికి వణికిపోయారు.

కుక్క తల, నోటిపై పొడిచిన నరెన్.. దాని నాలుకను ముక్కలు చేశాడు. పాపం ఆ కుక్క పిల్ల తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించింది. ఈ దారుణం జరిగే సమయంలో యజమానురాలు అక్కడే వుంది.

కానీ నరెన్ క్రూరత్వానికి భయపడిపోయింది. సగం స్పృహలో ఉన్న ఆ మూగప్రాణం పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ నరేన్ దానిని పట్టుకుని చెవి కత్తిరించి, తలపై కొట్టాడు. ఆ తర్వాత దానిని తన ఇంటికి దగ్గరలో ఉన్న కొండపైకి విసిరేశాడు.

పోలీసుల విచారణలో తానెంత ప్రమాదకరమైన వాడినో తన బంధువులకు చూపించేందుకే ఈ నేరానికి పాల్పడినట్లు నరేన్ చెప్పాడు. సరిగ్గా కుక్కల పండుగ నాడే ఈ సంఘటన చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. మూగజీవిని దారుణంగా హింసించి చంపిన నరేన్‌ను కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.