రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. అల్వార్ జిల్లాలోని సరాయ్ మొహల్లాలో 300 ఏళ్ల ప్రాచీన శివాలయాన్ని బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు మండిపడుతుండగా.. అధికారంలోని కాంగ్రెస్ రియాక్ట్ అయింది.
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో బుల్డోజర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. అదీ ముఖ్యంగా నిర్మాణాలను కూల్చడానికే ఎక్కువగా వినియోగిస్తున్న ఘటనలు చూస్తున్నాం. బుల్డోజర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్న తరుణంలో ఓ చోట అవాంఛనీయ ఘటన జరిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ గురించిన చర్చ ఎక్కువగా జరుగుతుండగా, ఈ అవాంఛనీయ ఘటన కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో చోటుచేసుకుంది. అదీ ఏకంగా 300 ఏళ్ల శివాలయాన్ని నేలమట్టం చేయడానికి వినియోగించడంతో దుమారం రేగింది. రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో
ఈ ఘటన జరిగింది.
అల్వార్ జిల్లా సరాయ్ మొహల్లాలో 300 ఏళ్ల నాటి శివాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేశారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకిత వచ్చినప్పటికీ ఈ కూల్చివేత జరిగినట్టు తెలిసింది. దీనిపై కేసు నమోదు చేయాలని నగర్ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, రాజ్‌గడ్ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు అందాయి.
ఈ ఘటనకు సంబంధించి బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. కూల్చివేతకు సంబంధించిన ఓ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. కరౌలీ, జహంగిర్‌పురి ఘటనలపై మొసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్ హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని, ఇదే ఆ పార్టీ ఆచరిస్తున్న లౌకికతత్వం అని విమర్శించారు. ఏప్రిల్ 18న ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ అధికారులు .. రాజ్‌గడ్ పట్టణంలో 85 మంది హిందువులకు చెందిన పక్కా ఇళ్లను, షాపులను బుల్డోజర్లతో నేలమట్టం చేసిందని వివరించారు.
కాగా, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ రియాక్ట్ అయింది. బీజేపీ వాదనలు పచ్చి అబద్ధాలని రాజస్తాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియవాస్ తెలిపారు. రాజ్‌గడ్ అర్బన్ బాడీస్ బోర్డు చైర్మన్ ఒక బీజేపీ సభ్యుడు అని, ఆలయాలు, ఇళ్లను నేలమట్టం చేయాలన్న ప్రతిపాదన ఆయన చేసినవేనని పేర్కొన్నారు. చైర్మన్ సమక్షంలోనే ఆ శివాలయాన్ని ధ్వంసం చేశారని, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ కూల్చివేతలను ఆపేయాలని కోరుతున్నప్పటికీ వారు ఆపలేదని తెలిపారు. అంతేకాదు, న్యాయపరమైన చిక్కులేమీ లేకుంటే తాము ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని వివరించారు.
