రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఆహారం తీసుకున్న మూడు వందల మంది అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారులు శుక్రవారం తెలిపారు.
రాజస్థాన్‌లోని దౌసాలో ఫుడ్ పాయిజనింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దౌసా జిల్లా మందావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఆహారం తీసుకున్న దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సమాచారంతో సీఎంహెచ్‌ఓ డాక్టర్ సుభాష్ బిలోనియా స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామానికే వైద్య బృందాన్ని మోహరించారు. వైద్య శాఖ బృందం రాత్రంతా అస్వస్థతకు గురైన వ్యక్తులకు చికిత్స చేయడంలో నిమగ్నమై ఉంది.
వివరాల్లోకెళ్తే.. పఖర్ గ్రామంలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో గ్రామస్తులందరూ భోజనం చేశారు. అందులో లడ్డూలు, పూరీలు, కూరగాయలు వంటి రుచికరమైన ఆహారాన్ని వండించారు. సాయంత్రం 6 గంటల నుంచి గ్రామస్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి అంటూ ఇబ్బంది పడటం మొదలైంది. క్రమంగా అస్వస్థతకు గురైన వారి సంఖ్య పెరిగిపోయింది. స్థానిక ఆస్పత్రి నిండిపోయింది.
దీంతో అస్వస్థతకు గురైన వారిని మహ్వా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం వరకు దాదాపు 300 మందికి పైగా అస్వస్థతతో మందావర్, మహువా, దౌసా, సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో చేరారు. అదే సమయంలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్స కోసం వైద్య శాఖ బృందం కూడా బృందాన్ని అప్రమత్తం చేసింది. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారందరికీ చికిత్స కొనసాగుతోందని, అయితే.. కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెబుతున్నారు.
ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 300 మంది అస్వస్థతకు గురయ్యారని దౌసా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుభాష్ బిలోనియా తెలిపారు. అదే సమయంలో మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు. పుడ్ ఇన్స్ఫెక్షన్ బృందాన్ని అక్కడికక్కడే పిలిపించి, ఆహార నమూనాలను తీసుకున్నారు. ఇందులో లడ్డూ, పూరీ, కూరగాయలు నమూనాలను సేకరించారు. శాంపిల్ రిపోర్టు వచ్చిన తర్వాతే ఆహారంలో నాణ్యత లోపించిందా? లేదా? అనేది తేలుతుందని చెప్పారు.
