కరోనా వైరస్ దేశంలో విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదౌతున్నాయి. ఎటునుంచి ఎవరికి ఎలా సోకుతుందో కూడా అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో.. 30మంది కరోనా రోగులు అదృశ్యమయ్యారన్న వార్త అందరినీ తీవ్రంగా కలవరపెడుతోంది.

ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో కరోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గ‌డ‌చిన 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. అయితే దీనికి మించిన మ‌రొక ముప్పు వార‌ణాసిలో చోటుచేసుకుంది. 30 మందికి పైగా క‌రోనా బాధితులు త‌ప్పుడు ఫోన్ నంబర్, చిరునామా ఇచ్చి మాయ‌మ‌య్యారు. 

ఆరోగ్యశాఖ బృందం వీరికి చికిత్స అందించేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఈ విష‌యం వెలుగుచూసింది. దీంతో  ఆరోగ్యశాఖ సిబ్బందిలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది. ఆ క‌రోనా బాధితుల ఆచూకీ తెలుసుకునే ప‌నిని ఆరోగ్యశాఖ పోలీసులకు అప్పగించింది. కాగా ఈ బాధితులంతా వారణాసిలోని వివిధ పోలీస్‌స్టేషన్ ప‌రిధుల్లోని ప్రాంతాల‌కు చెందిన‌వార‌ని తెలుస్తోంది. వీరు బ‌య‌ట తిరుగుతుండ‌టంతో స్థానికుల్లో ఆందోళ‌న నెల‌కొంది.