తమిళనాడులోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. రెండు రోజుల్లోనే ఐఐటీ క్యాంపస్ హాస్టల్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. తాజాగా, 18 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
చెన్నై: తమిళనాడులోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో కరోనా కలకలం రేపుతున్నది. రెండు రోజుల్లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లోని హాస్టల్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. రెండు రోజుల క్రితం ఇక్కడ 12 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. తాజాగా, మరో 18 కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ క్యాంపస్‌లో మొత్తం కేసుల సంఖ్య 30కి పెరిగింది.
హాస్టల్‌లోనే అన్ని కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. కరోనా కల్లోలం సృష్టిస్తుండగా ఐఐటీ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ డిపార్ట్‌మెంట్ అప్రమత్తం అయింది. ఐఐటీ క్యాంపస్‌లో శానిటైజేషన్ ప్రారంభించింది. కరోనా నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
గురువారం మద్రాస్ క్యాంపస్‌లో 12 మందికి కరోనా సోకినట్టు తేలింది. అయితే, వారంతా టీకా తీసుకున్నవారేనని, కాబట్టి, వారి ఆరోగ్యం దిగజారిపోలేదని హెల్త్ సెక్రెటరీ జే రాధాక్రిష్ణన్ పేర్కొన్నారు. వారు హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇదిలా ఉండగా, తమిళనాడులో గురువారం మొత్తం 39 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,53,390కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 18 వేల శాంపిళ్లు టెస్టు చేస్తున్నారు. ఈ సంఖ్య 25వేలకు పెంచాలని ఆదేశించింది.
ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో కేసుల కలకలం రేగడంతో హెల్త్ సెక్రెటరీ జే రాధాక్రిష్ణన్ క్యాంపస్ పర్యటించారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని రాష్ట్రాలు కరోనా నిబంధనలు ఎత్తేశాయని ఆయన పేర్కొన్నారు. కానీ, తమిళనాడు మాత్రం ఇంకా నిబంధనలను ఎత్తేయలేదని గుర్తు చేశారు. బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదనే మినహాయింపు ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. కాబట్టి, ప్రజలు తప్పకుండా ముందు జాగ్రత్త చర్యలపై ఉదాసీనంగా ఉండరాదని కోరారు. కరోనా నియంత్రణ చర్యలు తప్పకుండా పాటించాలని సూచించారు.
దేశంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు (coronavirus) పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు ఉలిక్కిపడుతున్నాయి. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదంటూ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ హెల్త్ (telangana public director) డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు (dh srinivasarao) స్పందించారు. సీరో సర్వే ప్రకారం తెలంగాణలో ఫోర్త్‌వేవ్ (fourth wave) రాదని ఆయన స్పష్టం చేశారు. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఫోర్త్ వేవ్‌పై అనేక సందేహాలు వున్నాయని డీహెచ్ పేర్కొన్నారు.
తెలంగాణలో రోజుకు 20-25 కరోనా కేసులు మాత్రమే నమోదవుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ అదుపులోనే వుందని డీహెచ్ స్పష్టం చేశారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని ప్రజలకు ఆయన సూచించారు. తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదని శ్రీనివాసరావు తెలిపారు. మాస్క్ ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొవిడ్ పూర్తిగా పోలేదని.. రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదని.. హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదని శ్రీనివాసరావు చెప్పారు. సీఎం గత నాలుగు రోజులుగా కొవిడ్ వివరాలు తెలుసుకుంటున్నారని... ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు.
