అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్ల అఘాయిత్యాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తెలిసీ తెలియని వయసు, ఏం జరుగుతుందో కూడా తెలియని చిన్నారులనే టార్గెట్ చేస్తూ కామాంధులు రెచ్చిపోతున్నారు. మూడ నమ్మకాలతోనూ, కామంతోనూ కళ్లు మూసుకుపోయి ఇలా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ మూడేళ్ల చిన్నారిపై గుర్తు తెలియని దుండగులు దారుణంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

మధ్య ప్రదేశ్ బుర్హన్ పూర్ జిల్లా మెహద్ గ్రామానికి చెందిన ఒ మూడేళ్ల బాలిక తన ఇంటి వరండాలో అమ్మమ్మతో ఆడుకుంటోంది. అయితే మహిళకు ఇంట్లో పని ఉండటంతో బాలికను అక్కడే వదిలి లోపలికి వెళ్లింది. పని ముగించుకుని బయటికి వచ్చి చూడగా పాప కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన మహిళ చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు కూడా పాప ఆచూకీ కోసం వెతికినప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

వీరి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. మెహద్ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో పాప మృతదేహం లభించింది. దట్టమైన పొదల్లో ఒంటి నిండా గాయాలతో చిన్నారి మృతదేహం పడివుంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ పోస్టుమార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు తేలింది. అంతే కాదు బాలిక ఒంటిపై గోళ్లతో రక్కిన  గాయాలు, ఓ చేయి విరిగిపోయి ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మెడ భాగంలో బలమైన గాయం అవడంతో చిన్నారి
చనిపోయినట్లు ఈ రిపోర్టు బైటపెట్టింది.

దీంతో పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు.