ఓ వైపు దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ముందుకు దూసుకుపోతుంది. ఇలాంటి రోజుల్లోనూ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. వాటి మాయలోపడి కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు ఇతరులను ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి బిహార్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ముజ‌ఫ‌ర్‌పూర్‌లోని డ‌క్రామా గ్రామంలో ముగ్గురు మ‌హిళ‌ల‌ను గ్రామ‌స్తులు మంత్ర‌గ‌త్తెలుగా భావించారు. వారివ‌ల్ల త‌మ‌కు ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన గ్రామ ప్ర‌జ‌లు అంతా ఏక‌మై వారిపై దాడికి దిగారు. మ‌హిళ‌ల గుండు గీయించి, అర్ధ‌న‌గ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వం ప్ర‌ద‌ర్శించారు. 

అంతేకాక వారిచేత మ‌లం వంటి విస‌ర్జిత ప‌దార్థాలు తినిపిస్తూ నీచానికి ఒడిగ‌ట్టారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘ‌‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచార‌ణ జ‌రిపి, నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.