ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జార్సుగూడలో జరిగిన ప్రమాదంలో ట్రక్కులు మంటల్లో చిక్కుకోవడంతో ముగ్గురు ట్రక్కు డ్రైవర్లు సజీవదహనమయ్యారు.
ఒడిశాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జార్సుగూడలో జరిగిన ప్రమాదంలో ట్రక్కులు మంటల్లో చిక్కుకోవడంతో ముగ్గురు ట్రక్కు డ్రైవర్లు సజీవదహనమయ్యారు. బుధవారం అర్దరాత్రి దాటి తర్వాత ఎన్‌హెచ్-49 పై జార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ట్రక్కులు ఒకవైపు నుంచి వస్తుండగా ఒకదానికొకటి ఢీకొట్టాయి. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో ట్రక్కు.. ఈ రెండు ట్రక్కులను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. ట్రక్కుల్లో ఒకదానిలో బొగ్గు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ట్రక్కుల్లోనే చిక్కుకుపోయిన ముగ్గురు డ్రైవర్లకు సజీవదహనమయ్యారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదానికి దారితీసి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాలిపోయిన మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘోర ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం క్రేన్ సహాయంతో దెబ్బతిన్న ట్రక్కులను హైవేపై నుంచి తొలగించారు.
