న్యూఢిల్లీ: యాస్ తుఫాన్ దూసుకొస్తోంది.  తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఆదివారం నాడు రాత్రి వరకు అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదిలి తుపాన్ గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26 న ఉదయం ఒడిశా – బెంగాల్ తీరం తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. అదే రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది. 

also read:యాస్ తుఫాన్‌: ఉన్నతాధికారులతో మోడీ సమీక్ష

దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాజస్తాన్‌లో చాలా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందని పేర్కొంది. అయితే మరో మూడు రోజుల్లో రాజస్థాన్, హర్యానా, చండీగడ్, ఢిల్లీతోపాటు ఉత్తర్ ప్రదేశ్‌లపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది. దుమ్ము, ధూళితో కూడిన గాలులు వీస్తాయని వెల్లడించింది.మరోవైపు బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశం ఉంది. ఒడిశాలోని  మయూర్ భంజ్, భద్రక్, బాలాసోర్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. 

మరోవైపు జాజ్‌పూర్,  కేంద్రపర, కటక్, పూరీ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ నెల 26 వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ  ఇదివరకు తెలిపింది. మత్స్యకారులు ఎవరూ కూడ చేపల వేటకు వెళ్లొద్దని బెంగాల్ ప్రాంతీయ వాతావరణ కేంద్ర అధిపతి డాక్టర్ సంజీబ్ బంధోపాద్యాయ్  కోరారు.