యూట్యూబర్ దీక్షిత్ తన పుట్టినరోజును నిరుడు డిసెంబర్ 16న, తన స్నేహితులతో కలిసి జాతీయ రహదారిపై కదులుతున్న కార్లపై నిలబడి జరుపుకున్నాడు.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రిన్స్ దీక్షిత్ అనే యూట్యూబర్‌ను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దీక్షిత్ గత ఏడాది డిసెంబర్ 16న తన పుట్టినరోజును జరుపుకున్నాడు, అక్షరధామ్ నుండి ఘజియాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై కదులుతున్న కార్ల పైన తన స్నేహితులతో కలిసి నిలబడి వేడుకలు చేసుకున్నాడు. 

ఈ స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ‘ఈ వీడియో.. దాంట్లో ఉల్లంఘనలు మా దృష్టికి వచ్చాయి. అందులోని నేరస్థులను గుర్తించడానికి, సంఘటన ఏం టైంలో జరిగిందో.. తదితర వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నేరస్థులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

వైరల్ వీడియోలలో, యూట్యూబర్ అతని స్నేహితులు కదులుతున్న కార్ల పైకప్పులపై, నేపథ్యంలో బిగ్గరగా సంగీతం ప్లే చేస్తూ అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం చూడవచ్చు. దీక్షిత్ పుట్టినరోజు కావాల్‌కేడ్‌లో కొంతమంది కార్ల కిటికీలను తెరిచి.. అందులోనుంచి బయటికి రావడం, కొంతమంది బోనెట్‌లపై నృత్యం చేయడం కూడా కనిపిస్తుంది. 

దీక్షిత్‌ ను అరెస్ట్‌ చేసిన తర్వాత ఈ స్టంట్‌లో పాల్గొన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిమీద తదుపరి విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Scroll to load tweet…