న్యూఢిల్లీ: ఆంఫన్ తుఫాను పశ్చిమ బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను వల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. భవనాలు కుప్పకూలాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. తుఫాను వల్ల పశ్చిమ బెంగాల్ లో 12 మంది మరణించారు.

ఆంఫన్ తుపాను ప్రభావం కరోనా వైరస్ వ్యాధి కన్నా తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తుఫాను ప్రభావం కారణంగా పశ్చిమ బెంగాల్ లో ఐదు లక్షల మందిని, ఒడిశాలో లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

తుఫాను కారణంగా ముగ్గురు మరణించారని, ఈ సంఖ్య 12కు పెరగవచ్చునని మమతా బెనర్జీ అన్నారు. నార్త్, సౌత్ 24 పరగణాల జిల్లాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ప్రతిదాన్నీ పునర్నిర్మించాల్సి ఉంటుందని అన్నారు. 

భారీ గాలులకు చెట్టు విరిగిపడడంతో 24 నార్త్ పరగణాలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.  వారిలో ఓ పురుషుడు, ఓ మహిళ ఉన్నారు. హౌరా జిల్లాలో చెట్టు విరిగి మీద పడడంతో 13 ఏళ్ల బాలిక మరణించింది. 

నార్త్ పరగణాస్ లో 5,500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. నార్త్, సౌత్ పరగణాల్లో కరెంట్ లేకపోవడంతో గాఢాంధకారంలో చిక్కుకున్నాయి. కోల్ కతాలో గంటకు 100 కిలోమీటర్లకు పైగా గాలులు వీచాయి. దీంతో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు లేకపోవడంతో నగరంలోని ఓ భాగంలో చీకటి అలుముకుంది. వీధుల్లో నీరు చేరింది. చెట్లు విరిగిపడ్డాయి.