అప్పటి వరకు ఆనందంగా సాగిన పెళ్లి లో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చి.. వధూవరులను ఆశీర్వదించాల్సిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వధూవరులతో సహా.. మరో 250మంది అస్వస్థతకు గురయ్యారు. దీనంతటికీ.. కారణం.. వివాహ విందేనని పోలీసులు గుర్తించారు. ఈ దారుణ సంఘటన ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. బాగేశ్వర్ కి చెందిన   ఓ యువతీ, యువకుడు ఈ రోజు వివాహ  బంధంతో ఒక్కటవ్వాల్సి ఉంది. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బంధు మిత్రులంతా  పెళ్లికి తరలివచ్చారు. ప్రత్యేకంగా తయారు చేయించిన వింధు భోజనాన్ని ఆరగించారు. అంతే.. ఆ భోజనం తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు.

బాధితులందరినీ బేరినాగ్‌, కాప్‌కోట్‌, బాగేశ్వర్‌, అల్మోరా, హల్ద్‌వానీ ప్రాంతాల్లో వేర్వేరు ఆస్పత్రులకు తరలించినట్లు వివరించారు. వింధు భోజనం ఫుడ్ పాయిన్ అవ్వడం వల్ల ఈ దారుణం  జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేద సింగ్‌ రావత్‌.. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

అస్వస్థతకు గురైన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాధితులకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పెళ్లి వేడుకలో ఆహారం ఎలా కలుషితమైందన్న దానిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విందులో వడ్డించిన పెరుగు కలుషితమైనట్లు తెలుస్తోంది. పెళ్లి భోజనం చేసినవారందరికీ ఇళ్లకు వెళ్లగానే వాంతులు, విరేచనాలు అయ్యాయని పోలీసులు వెల్లడించారు.