అతను ఓ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. చూసేవారందరికీ అతను ఎంత శ్రద్ధగా పనిచేస్తాడో అనేలా నమ్మిస్తాడు. కానీ.. ఎవరికీ తెలీకుండా తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్కెచ్ వేసి బ్యాంక్ లో దాదాపు 15కిలోల బంగారం కాజేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వివ‌రాల్లోకి వెళితే గోల్డ్ లోన్ ‌లాక‌ర్ నుంచి 101 ప్యాకెట్ల బంగారు ఆభరణాలు మాయ‌మైనట్టు షియోపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచార‌ణ‌లో క్యాషియర్‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అత‌ను త‌న ఇద్దరు సహచరులతో కలిసి ఈ చోరీకి పాల్ప‌డిన‌ట్లు వెల్ల‌డ‌య్యింది. 

క్యాషియర్ తన స్నేహితుడు నవీన్, గ‌ర్ల్‌ ఫ్రెండ్‌ జ్యోతిల‌తో క‌ల‌సి ఈ చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు కిలోల బంగారం, 11 లక్షల న‌గ‌దును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.