జిమ్ లో వ్యాయామం చేస్తూ.. ఓ యువకుడు కన్నుమూసిన సంఘటన మహారాష్ట్రలోని థానేలో  చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థానే నగరం ఖర్ కర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన ప్రతీక్ పరదేశీ(28)  హోల్ సేల్ కూరగాయాల వ్యాపారం చేస్తుండేవాడు. ఇతనికి తరచూ జిమ్ లో వ్యాయామం చేయడం అలవాటు.

తన ఇంటికి సమీపంలోని గోల్డ్ జిమ్ లో రోజూ వ్యాయామం చేసేవాడు. వారం రోజుల క్రితం పనిమీద ఊరువెళ్లిన ప్రతీప్.. శుక్రవారం తిరిగి వచ్చాడు. ఈ రోజు ఉదయం జిమ్ కి వచ్చి వ్యాయామం చేస్తుండగా.. నీరసంగా అనిపించింది. వెంటనే  చేస్తున్న వ్యాయామాన్ని ఆపేసి కాసేపు పక్కన కూర్చున్నాడు. అంతలోనే అక్కడికక్కడే కుప్పకూలాడు.

గమనించిన స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా...గుండె నొప్పితో మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతీక్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.