కర్ణాటకలో జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కానుందని దాదాపు సర్వేలన్నీ చెప్పాయి. ఈ క్రమంలో కుమారస్వామి మరోసారి సీఎం అవుతారంటూ జోరుగా బెట్టింగ్ జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఎవరు ఈసారి అధికారాన్ని అందుకోబోతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ వుందని చెబుతూనే హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని పేర్కొంది. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కానుందని దాదాపు సర్వేలన్నీ చెప్పాయి. ఈ క్రమంలో కుమారస్వామి మరోసారి సీఎం అవుతారంటూ జోరుగా బెట్టింగ్ జరుగుతున్నాయి. అయితే పాత మైసూరు ప్రాంతానికే పరిమితమై , ఉప ప్రాంతీయ పార్టీ వున్న జేడీఎస్ ప్రతిసారి 25 నుంచి 30 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు.. ఏకంగా సీఎం పదవిని సైతం ఎన్నోసార్లు పొందింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే..
జనతాదళ్ సెక్యులర్ సింపుల్‌గా జేడీఎస్ .. కర్ణాటక రాజకీయాలతో పాటు భారతదేశ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. సొంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ కింగ్ మేకర్ అనిపించుకుంది. 2023లోనూ మరోసారి కింగ్ మేకర్ అదేనంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 1999లో జేడీఎస్‌ను స్థాపించారు దేవేగౌడ . నాటి నుంచి నేటి వరకు ఒక్కసారి కూడా ఈ పార్టీ ప్రభుత్వాలను సొంతంగా ఏర్పాటు చేయలేకపోయింది. కానీ రెండుసార్లు సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగమైంది. 2006లో బీజేపీతో కలిసి 20 నెలల పాటు కర్ణాటకను పాలించింది. 2018 మేలో మరోసారి కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ జేడీఎస్‌కు వచ్చింది. అప్పుడు 14 నెలల పాటు జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా వున్నారు.
ALso Read: కర్ణాటకలో మళ్లీ హంగ్ తప్పదా?.. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా?.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదేమిటి?
కానీ 2023లో మాత్రం చరిత్రను తిరగరాయాలని భావిస్తోంది. మిషన్ 123 పేరుతో పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. పాత మైసూరుకే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అభ్యర్ధులను నిలబెట్టింది. బీజేపీ, కాంగ్రెస్‌లలో టికెట్ దక్కని బలమైన నేతలకు బీ ఫాంలు ఇచ్చింది. అవసరమైతే అప్పటికే అభ్యర్ధిని ప్రకటించి కూడా వారిని పోటి నుంచి తప్పించింది. అంతేకాదు ‘‘కన్నడ ప్రజల గౌరవం’’ పేరుతో ప్రాంతీయ వాదాన్ని జేడీఎస్ తట్టిలేపుతోంది. 2004లో అత్యధికంగా 58 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ మళ్లీ 50 మార్క్ దాటలేకపోయింది.
కాంగ్రెస్, బీజేపీలు ఎన్నిసార్లు ట్రై చేసినా పాత మైసూరు ప్రాంతాన్ని కదిలించలేకపోతున్నాయి. ఈ ప్రాంతంలోని ఒక్కలిక సామాజిక వర్గం ఇప్పటికీ ఈ పార్టీకి వెన్నుదన్నుగానే వుంది. ఈ ప్రాంతంలోని 61 సీట్లలో జేడీఎస్ ప్రభావం వుంది. కుటుంబ పార్టీ అని మద్రపడినా జేడీఎస్‌పై ఆ ప్రాంతంలో వున్న సానుకూలతే ఆ పార్టీని ముందుకు నడిపిస్తోంది. ఏది ఏమైనా ఆ పార్టీ అంతా దేవే గౌడ కుటుంబం చుట్టూనే తిరుగుతోంది. మరి ఈసారి జేడీఎస్‌ను ప్రజలు కింగ్ మేకర్‌ని చేస్తారో లేక తనకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని ఇస్తారో చూడాలి.
