కర్ణాటక చామరాజనగర్ లో దారుణ విషాదం చోటు చేసుకుంది.  చామరాజనగర్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం (మే 3, 2021)  ఉదయం ఆక్సీజన్ అందక 24 మంది కరోనా రోగులు మరణించారు.

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. నేరుగా శ్వాసవ్వవ్థను దెబ్బ తీస్తూ మరణాలకు కారణమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఆక్సీజన్ కొరత నెలకొంది. 

ఈ విషాద సంఘటన తరువాత, ఆసుపత్రిలో ఆక్సిజన్  కొరతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సురేష్ కుమార్ సోమవారం చెప్పారు.

"గత 24 గంటల్లో ఆక్సిజన్ కొరత, ఇతర కారణాల వల్ల చమరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో మరణించిన వారిలో కరోనావైరస్ రోగులతో సహా  24 మంది రోగులు ఉన్నారు" అని కుమార్ ధృవీకరించారు. అంతేకాదు "ధృవీకరణ కోసం డెత్ ఆడిట్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని" అని ఆయన చెప్పారు.

ఈ విషయంపై అధికారులు విచారణ కూడా ప్రారంభించారు. ఈ సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, రేపు (మంగళవారం) అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్నాయి. ఈ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఆదివారం గడిచిన 24 గంటల్లో 37,733 తాజా COVID-19 కేసులు, 21,149 రికవరీలు,  217 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,64,398 కాగా, రికవరీలు 4,21,436 ఉన్నాయి. అయితే, రాష్ట్ర ఆరోగ్య నివేదిక ప్రకారం ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 16,011 గా ఉంది.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona