23ఏళ్ల యువకుడు గ్యాంగ్ స్టర్ గా మారి ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన డిల్లీలో చోటుచుసుకుంది. తన సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నాడని అనుమానం రావడంతో గ్యాంగ్ స్టర్ తన అనుచరుల్లోని ఓ వ్యక్తి నోట్లో తుపాకి పెట్టి కాల్చి చంపాడు. ఈ ఘటన డిల్లీలో తీవ్ర కలకలం రేపింది.

ఢిల్లీ నజఫ్‌ఘర్ ప్రాంతానికి చెందిన దీపక్ అనే 23ఏళ్ల యువకుడు స్థానికంగా గొడవలు, దొమ్మీలకు పాల్పడుతూ రౌడీషీటర్ గా చెలామణి అవుతున్నాడు. తనతో పాటు మరికొంత మంది నేరచరిత కలిగిన వారిని పోగేసుకుని ఓ గ్యాంగ్ ను ఏర్పాటుచేసుకున్నాడు.  అయితే వీరి రౌడీ గ్యాంగ్ కి అదే ప్రాంతంలో వుండే మరో గ్యాంగ్ కు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

అయితే తమ సమాచారాన్ని ఎవరో ప్రత్యర్థి ముఠాకు చేరవేస్తున్నారని...అందువల్లే పలుమార్లు వాళ్లు తమపై ప్లాన్ ప్రకారం దాడిచేసివుంటారని దీపన్ కు అనుమానం కల్గింది. ఇలా సమాచారాన్ని చేరవేస్తున్నది తమతో పాటే ఉండే  40 ఏళ్ల స్థానిక నేరస్థుడు రోషనేనని అనుమానించాడు. దీంతో అతడిని పిలిచి ప్రశ్నించే క్రమంలో రోషన్ ఎదురుతిరగడంతో దీపక్ తన వద్ద వున్న గన్ ను అతడి నోట్లో పెట్టి కాల్చాడు. దీంతో రోషన్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

అనంతరం మృతదేహాన్ని అక్కడే పడేసి ముఠా సభ్యులు వెళ్లిపోయారు. అయితే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని సిసి కెమెరాల్లో హత్యా దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు నిందితుడు దీపక్  ను పట్టుకుని విచారించగా జరిగిన విషయాన్ని బైటపెట్టాడు.