వారు ఒకరిని మరొకరు ప్రాణం కన్నా ఎక్కువగ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించుకోవాలని అనుకున్నారు. వారి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించారు. వారు కూడా వారి ప్రేమను అంగీకరించారు. పెళ్లి ముహుర్తాలు కూడా పెట్టేశారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా... వారి ప్రేమను చావు వేరు చేసింది. ఒక సెల్ఫీ వారిని ఒకరి నుంచి మరొకరిని దూరం చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

AlsoRead సెగలు రేపుతున్న తీస్ హజారీ వివాదం: రోడ్డెక్కిన పోలీసులు, న్యాయం కోసం డిమాండ్...

పూర్తి వివరాల్లోకి వెళితే.... తమిళనాడు రాష్ట్రంలోని  చెన్నై సమీపంలోని పట్టాభిరామ్‌కు చెందిన అప్పు (24) అదే ప్రాంతానికి చెందిన మెర్సీ (23) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న ఇరు తరపు కుటుంబీకులు జనవరిలో వివాహం చేసేందుకు నిర్ణయించారు. 

ఈ క్రమంలో ఆ ప్రేమ జంట ఆవడి కండిగై సమీపంలోని 400 అడుగుల రోడ్డులో ఉన్న బావి వద్ద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో మెర్సీ ప్రియుడితో కలిసి సెల్ఫీ దిగేందుకు యత్నించింది. హఠాత్తుగా కాలుజారి బావిలో పడడంతో నీటమునిగింది. ఆమెను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. 

అప్పు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేమాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మూడేళ్లుగా ప్రేమించుకుని వివాహం చేసుకోబోతున్న సమయంలో ప్రియురాలు మృతిచెండం ప్రియుడ్ని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.