నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, 31 మంది గాయపడ్డారు. రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఆటోను ఢీకొనడంతో మంగళవారం ఆ ప్రమాదం జరిగింది. అయితే, ప్రమాదంలో ఏడుగురు మాత్రమే మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంలో కనీసం 26 మంది మరణించినట్లు తెలుస్తోంది. 

డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు కూడా పక్కన ఉన్న బావిలో పడిపోయాయి. బస్సు వెనక చక్రం పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. 

మృతుల కుటుంబాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఎఎస్ఆర్టీసి చైర్మన్ అనిల్ పరబ్ పది లక్షల రూపాయలేసి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 5 లక్షల రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించారు గాయపడిన వారికి ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపం ప్రకటించారు. ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. 

క్రిక్కిరిసిన ప్రయాణికులతో ఉన్న బస్సు ఆటో రిక్షాను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. మాలేగావ్ డియోలా రోడ్డుపై మేషీ ఫటాలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు ఆటో రిక్షాను లాక్కుంటూ వెళ్లింది. దీంతో రెండు వాహనాలు కూడా బావిలో పడ్డాయి.